పరమాశ్చర్యం

చంద్రబాబుకు పరమాశ్చర్యంగా
ఉంది. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ఎమ్మెల్యేలను కొంటారా? ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం? హవ్వ...ఎక్కడైనా విన్నామా, కన్నామా అంటూ గుండెలు
బాదుకున్నారు. కర్ణాటకలో బీజెపీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనడం అక్రమం
అని కన్నెర్ర చేసారు. సచివాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు ఆశ్చర్య, సంభ్రమాశ్చర్యాలను చూసి
విలేఖరులే మూర్ఛపోయారట.

చంద్రబాబు గొప్పతనం
అదే. ఏ గురివిందా తనకింద మచ్చుందని ఒప్పుకోదు. అలాగే బాబుగారు సైతం తాను చేసిన పనులను సునాయాసంగా
మర్చిపోతారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి లాక్కున్న
విషయాన్ని అలవోకగా మరచిపోయి, బీజేపీ ఎమ్మెల్యేలను కొంటోందంటూ నిస్సిగ్గుగా ధ్వజం
ఎత్తగలరు బాబు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను కొనబోతూ, ఆడియో టేపుల్లో అడ్డంగా
దొరికిపోయి, అర్థంతరంగా ఉమ్మడి రాజధానిని వదిలి పారిపోయి వచ్చిన మాట కూడా సులభంగా మరచిపోయి
బీజేపీ తీరు అన్యాయం అంటూ అరవగలరు.

బాబూ తీరే అంత. గతంలో తిట్టిన నోటితోనే
నేడు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధం అయిపోయాడు. మోదీని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వను అన్నమనిషే
మోదీని వేనోళ్ల పొగిడాడు. బీజేపీ నేతలు ఎమ్మెల్యేలను కొనడానికి దిగజారిపోయారని
విమర్శిస్తున్నారు బాబుగారు. తమ పార్టీలోకొస్తే బాగా సంపాదించుకోవచ్చని చెప్పారని
ఆగ్రహించారు. ఇంత వింత పోకడ నేనెప్పుడూ చూడలేదన్నారు. నిజమే మరి కొత్త పోకడలు, బేరసారాలు ఆయన చేయడమే
తప్ప వేరొకరు చేయగా చూడ్డం ఇదే మొదలేమో! అందుకే ఆయన అంతగా హాశ్చర్యపడిపోయారు.  

కాంట్రాక్టులు పంచుకోవడం, కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, ఇసుక, మట్టిని తవ్వుకుపోవడం, అవినీతిని కూడా వ్యవస్థీకృతం
చేయడం, దోపిడీకి రాచబాటలు వేయడం, అన్యాయాలకు అధికారిక రాజముద్ర ఇవ్వడం చంద్రబాబు నీతి. ఇదికానిదేదైనా ఆయనకు
అవినీతి, అక్రమం. ఆయన చేస్తే వ్యాపారం మరొకరు చేస్తే యవ్వారం. 

Back to Top