పైన అమరావతి కింద నిషావతి

డిసెంబర్ 31 అర్థరాత్రి.
అమరావతి అంతా కోలాహలంగా ఉంది.
అందరి చేతుల్లోనూ గ్లాసులు ఒక్కచోట చేరి సర్రున నురగలు కక్కుతున్నాయి.
కిసకిసా నవ్వులు వినబడుతున్నాయి. 
అంతా ఆనందంగా నాట్యాలు చేస్తున్నారు.
అప్పుడొచ్చాడు అక్కడికి అమరావతీధీశుడు.
మర్యాద కోసం లేచి నిలబడబోయి తూలి ముందుకు పడ్డారు కొందరు. 
తనకోసం సాష్టాంగ ప్రమాణం చేస్తున్నారనుకున్నాడు అమరావతీధీశుడు.
నవ్వుతూ వెళ్లి సింహాసనం మీద కూచున్నాడు. 
నా పాలనలో అమరావతి అంతా ఆనందంగా, బ్రహ్మాండంగా, సంతృప్తి కరంగా ఉంది కదూ అన్నాడు దర్పంగా...
ఎవ్వరూ మాట్లాడలేదు. 
అదేమిటీ మీలో ఎవరికైనా ఆనందంగా లేదా...స్వర్గంలోనే సంతోషం లేకపోతే ఇంకెక్కడుంటుంది అన్నాడు అమరావతీనాధుడు ఆందోళనగా అడిగాడు...
అప్పటికీ ఎవ్వరూ మాట్లాడలేదు. 
కావాల్సినంత కలరింగు ఉంది...రోజుకో ఆటపాట ఉంటోంది. తాగినంత సురాపానం చేయిస్తున్నాను. ఇంకేకావాలి మీకు...కోపంగా అడిగాడు...
కింద భూమ్మీదకి వేలు చూపించాడు వారిలో ఒకడు.
అదుగో అక్కడున్నది ఆంధ్రరాష్ట్రం. అక్కడున్న అమరావతిలోనూ అవన్నీ ఉన్నాయి. అప్పుడు దీనికీ దానికీ తేడా ఏమిటి..? అందుకే మన అమరావతి పేరు మార్చేస్తే బావుంటుందనుకుంటున్నాం అన్నాడు.
అదెలా! ఆశ్చర్యపోయాడు పైనున్న అమరావతి రాజు.
బెలూను ఫెస్టివల్, విశాఖా ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్, సాగర సంబరాలు ఇలా బోలెడు జరుగుతున్నాయి. రోజుకో పండుగ, వారానికో ఫెస్టివల్ అన్నాడు.
అంతేనేంటి ఇక్కడ మనకే కాదు అక్కడ కూడా 24 అవర్స్ సురాపానం ఉంది. చూడండి. అక్కడ అర్థరాత్రి దాటినా అందరూ హాయిగా నిషాలో తూగుతున్నారు. ఇంతకు మించిన స్వర్గం ఉంటుందా...ఉడుక్కుంటూ అన్నాడు కిందికి చూపించిన వాడు.
అవునా అంటూ అమరావతీనాధుడితో పాటు అందరూ కిందకు తొంగి చూసారు. 
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అక్కడక్కడా హడావిడిగా ఉంది.
కాస్త క్లోజప్ లో చూసాడు పైనున్న అమరావతి కింగ్.
ఇది అమరావతి కాదు...అంటూ పాడుతున్నాడు ఒకడు. 
బీరావతి, మద్యావతి, మత్తావతి, గమ్మత్తావతి, భ్రమరావతి  ఈ మతిలేని దానికంతటికీ మీరే అధిపతి అంటూ పాడుకుంటున్నాడు.
తాగితే నిజాలు బైటికొస్తాయన్నమాట నిజమేనన్నమాట అనుకున్నాడు అమరావతీ నాయకుడు.
తెగతాగమని, తాగి ఊమగమని, ఊగి తూగమని, తూగి తూలమని, తూలి జారమని...మత్తు మత్తుగా పాడుతూ, పడుతూ లేస్తూ పోతున్నాడు ఇంకొకడు.
ఎవరి కోసం ఎవరి కోసం ఈ ఫెస్టివల్లు...ఈ డిస్టబెన్సు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం...మరొకడు మహత్తరంగా పాడేస్తున్నాడు.
చూసారా ఇదీ అసలు విషయం... ఆంధ్రా అమరావతీ నాయకుడు చేసే మాయలకు అక్కడివాళ్లే మోసపోయారనుకున్నా మీరూ బోల్తాపడ్డారా అని నవ్వాడు పైనున్న స్వర్గలోకపురాజు.
మీరు ఆనందం కోసం తాగుతున్నారు..అక్కడాయన తన ఆదాయం కోసం తాగిస్తున్నాడు...
తేడా తెల్సుకోండి అని చక్కాపోయాడు. 
Back to Top