ఓటుకు కోట్ల కేసు భయానికే అమరావతి జపం

పట్టువదలని విక్రమార్కుడు గొడుగు వేసుకుని వస్తున్నాడు.
విక్రమార్కుని అల్లంత దూరంనుంచి చూడగానే భేతాళుడు పడి పడి నవ్వాడు.
భేతాళుడు ఎందుకు నవ్వుతున్నాడో అర్ధం కాని విక్రమార్కుడు...ఏం భేతాళా నన్ను చూస్తే మరీ అంత వెటకారంగా ఉందా ఏంటి? అలా నవ్వుతున్నావు? అని కొంచెం కోపంగానే అడిగాడు.
దానికి భేతాళుడు మళ్లీ గట్టిగా నవ్వేసి.. అదేం లేదు విక్రమార్కా నీ చేతిలో గొడుగు చూస్తే నవ్వొచ్చిందంతే అన్నాడు. 
"గొడుగేసుకుని వస్తే అంత నవ్వెందుకు వస్తుంది? " అని నిలదీశాడు విక్రమార్కుడు.
"నవ్వెందుకు రాదయ్యా బాబూ.. ఏపీ ..తెలంగాణాల్లో రైతులంతా వర్షాల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తోంటే.. ఒక్క చుక్క రాలడం లేదు. నువ్వు మాత్రం తడిసి ముద్దయిపోతామేమో అన్నట్లుగా గొడుగేసుకుని వచ్చావు. సర్లే ఇక ఆ సంగతి పక్క పెట్టేయ్. "నువ్వు ఊ...అంటే నేను కథ మొదలెట్టేస్తాను ఎందుకాలస్యం?" అని భేతాళుడు అన్నాడు.
సరే మరి చెప్పేయ్ అన్నాడు విక్రమార్కుడు.
భేతాళుడు చెప్పడం మొదలు పెట్టాడు.
"విక్రమార్కా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రేంటయ్యా  అలా దూసుకుపోతున్నారు. అయిదేళ్ల దాకా ఉమ్మడి రాజధానిలోనే ఉండి పరిపాలన సాగిస్తామని అన్నారు కదా. మరి ఉన్నట్లుండి  మొత్తం సెక్రటేరియట్ సిబ్బంది అందరినీ అమరావతి తరలించేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ ను తానే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లానని అలాగే అమరావతిని కూడా ఆ స్థాయికి తీసుకు వెళ్తానంటున్నారు.ఈ లెక్కన ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని మరో ఏడాదిలో పూర్తి చేస్తారేమో అన్నంత వేగంగా ఆయన  హడావిడి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం    హైదరాబాద్ ను ఉమ్మడి  రాజధానిగా  అయిదేళ్లు కాదు కనీసం పదేళ్లు ఉంచాలని ఇదే చంద్రబాబు నాయుడు అడిగారు. ఇపుడేమో మొత్తం పరిపాలన అంతా అమరావతి నుంచే  సాగాలంటున్నారు. హైదరాబాద్ నుండి  ఉద్యోగులంతా మూట ముల్లె సద్దుకుని రావల్సిందే అంటున్నారు. " విక్రమార్కా...ఇపుడు  చెప్పు అసలు చంద్రబాబు నాయుడు  ఇలా  గేర్ మార్చడానికి కారణాలేంటి?సచివాయాన్ని అమరావతికి ఆగమేఘాల మీద తరలించడానికి కారణాలేంటి? సచివాలయంతోపాటు అక్కడి ఉద్యోగులకు అవసరమైన  నివాస భవనాలు కట్టేశారా ఏంటి? అయిదేళ్లు కూడా పూర్తికాకుండానే హైదరాబాద్ ను విడిచి పోవాలని చంద్రబాబు ఎందుకనుకుంటున్నారు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలైపోతుంది  అని భేతాళుడు ముగించాడు.

విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించి చెప్పడం మొదలు పెట్టాడు.
"ఏం లేదు భేతాళా. ఏమీ చేయకపోయినా అన్నీ తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబులు దాన్ని కట్టారు. అదంతా కూడా తన ఖాతాలో వేసేసుకుంటున్నారు చంద్రబాబు. సరే దాన్ని వదిలేయ్. అమరావతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తానంటున్నారు. సంతోషం. తెలుగు వాళ్లంతా అదే కోరుకుంటారు. అంతర్జాతీయ స్థాయి మాట దేవుడెరుగు అసలు అమరావతిలో ఇప్పటికిప్పుడు సచివాలయాన్ని తరలించేయడానికి అక్కడ మౌలిక సదుపాయాలేవీ పూర్తి కాలేదు. అయినా ఆయన ఉద్యోగులను బలవంతంగా అమరావతి వైపు వచ్చేయమని మెడమీద కత్తి పెడుతున్నారు. దానికి కారణం మరేం లేదు. అమరావతి చుట్టు పక్కల భూముల రేట్లు  చాలా వేగంగా పెరుగుతాయని రెండేళ్ల క్రిత చంద్రబాబు అనుకున్నారు. అందుకే అక్కడ టిడిపి నేతలంతా పెద్ద మొత్తంలో భూములు కొన్నారు. ఇపుడు భూముల ధరలు అంతలా పెరగడం లేదు. అవి పెరగాలంటే.. సచివాలయం..అసెంబ్లీ.. ముఖ్యమంత్రి కార్యాలయం.. ఇలా ప్రభుత్వ కార్యాలయాన్నింటినీ  ఎలాగో ఒకలాగ ప్రారంభించేస్తే.. అపుడైనా చుట్టు పక్కల భూముల ధరలకు రెక్కలొస్తాయన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే మళ్లీ నిన్న కాక మొన్న చైనా  షికారు వెళ్లి వచ్చారు. రాజధాని నిర్మాణ జపాన్ చేస్తుందంటున్నారు. అమరావతిని సింగపూర్ లా కడతామంటున్నారు. ఇవన్నీ చెప్పడానికి కూడా కారణం ఉంది. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద ఏపీకి రావడానికి అసలు కారణం ఆయనపై ఉన్న ఓటుకు కోట్లు కేసే. ఆ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాతనే చంద్రబాబు  హైదరాబాద్ ను విడిచి పోవాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే రాజధాని నిర్మాణంలో అక్రమాలపైనా    నిఘా కళ్లు పడితే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఫోన్ల ట్యాపింగ్ కు.. తెలంగాణ పోలీసుల స్టింగ్ ఆపరేషన్లకు దూరంగా పోయేందుకే ఆయన అమరావతి నుంచి పాలన అని హడావిడి చేస్తున్నారు. అని చెప్పాడు. 
విక్రమార్కుని సమాధానం తో సంతృప్తి పడ్డ భేతాళుడు అమాంతం మాయమై తిరిగి చెట్టుకి వేలాడాడు.
Back to Top