అమర’కొర్రి’

చంద్రబాబు ఆలోచనలు ఆకాశాలు, సముద్రాలు, కొండలు, పర్వతాలూ దాటుకుని వెళ్లిపోతుంటాయి. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. వాటి సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు కొందరు దక్షిణ కొరియన్ కంపెనీల ప్రతినిధులు వచ్చారు. చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి, యథా శక్తి సత్కారాలు చేసాడు. 
గత మూడున్నరేళ్లుగా పారిశ్రామిక వేత్తలకు వేస్తున్న టేప్ ను ఆన్ చేసాడు. 
ఆ ఆడియో ఇలా సాగుతోంది…
‘నా ప్రియమైన కొరియన్ సోదర, సోదరీమణి పారిశ్రామిక వేత్తలారా…నేను అడ్మినిస్ట్రేషన్ కింగును, అభివృద్ధి చేయడంలో అమెరికా ప్రెసిడెంటంతటి వాణ్ణి, అప్పులు తేవడంలో ఆరితేరినవాణ్ణి – కావాలంటే వల్డ్ బ్యాంకును అడగండి. ఇక మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానంటే అదిగో కనుచూపు మేర అమారవతి అంతా ఖాళీగా ఉంది. వేలమంది రైతుల గొంతుమీద కత్తి పెట్టి భూసేకరణ చేసి పెట్టాను. ముక్కలు ముక్కలుగా పంచడానికి ఇదిగో కత్తి కూడా రెడీగా పెట్టాను. ఇంకా మీకేం సదుపాయాలు కావాలో చెప్పండి…కృష్ణా నది నుంచి నీరు తోడు పెడతాను. 24 గంటలూ ఉచిత విద్యుత్తు ఇస్తాను. కావాల్సిన అనుమతులన్నీ ఇస్తాను’ బాబు చెబుతూనే ఉన్నాడు.
బాబు వాక్ప్రవాహానికి అదిరిపడ్డారు కొరియన్లు…చాలు సార్ చాలు ఇంతగా సాయం చేసే ముఖ్యమంత్రులు దొరికితే ఈ పాటికే మేం ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టేసేవాళ్లం అన్నారు. 
బాబు ఉబ్బి తబ్బిబ్బై పోయాడు. ‘మా రాజధానిని కూడా మీ రాజధానే అనుకోండి. మీ రాజధానిలో పెట్టినట్టే మా రాజధానిలోనూ పెట్టుబడులు పెట్టండి. పరిశ్రమలు పెట్టండి’ కొరియన్ ప్రతినిధులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు బాబు. 
ఎట్టెట్టా మీ రాజధాని మా రాజధాని అనుకోవాలా? అసలు మీ రాజధానిని మీరైనా రాజధాని అనుకుంటున్నారా? అసలు రాజధాని అన్న పేరు తప్ప ఆ తర్వాత రాజధాని కోసం ఏ చిన్న పనైనా మొదలెట్టారా? రాజధాని కోసం ఒక్కటి కూడా చేయకుండా చైనాని, సింగపూరుని, దుబాయి ని వచ్చి అమరావతిలో అది చేసేయండి, ఇది చేసేయండి అంటున్నారు. ఏదో కాస్త తక్కువ ఖర్చుతో పరిశ్రమలు పెడదామని వచ్చాం…ఇక్కడికొచ్చాక తెల్సింది అమరావతి బోర్డు తప్ప, సవ్యంగా ఓ రోడ్డు కూడా లేదని…మీ రాజధాని అభివృద్ధి చెందడానికి దేశాలన్ని వచ్చి ఇక్కడ పని చేయవు. ముందు తమరి ప్రభుత్వం పూనుకోవాలి. అది చూసి ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయి. ఇక వస్తాం…అని బయలు దేరారా ప్రతినిధులు. 
అయ్యయ్యో ఆగండి… ఆగండి…మీ కోసం అమరావతిలో ఒక సిటీ కట్టిస్తాను. కొరియన్ సిటీ అని పేరు పెడతాను. కావాలంటే మా అమరావతికి మీ పేరు సగం తగిలించి ‘అమరకొర్రి’ అని నామకరణం చేస్తాను…చంద్రబాబు అరుస్తున్నాడు..అప్పటికే ఆ బృందం తుపాకీ గుండుకు దొరకనంత వేగంగా అమరావతిని వదిలి వెళ్లిపోయింది. 

Back to Top