తాత్కాలిక పాలన - శాశ్వత ఉద్వాసన

చంద్రబాబు ఏది చేసినా ఆలోచించే చేస్తాడబ్బా. లేకపోతే అన్నీ తాత్కాలికంగా ఎలా కడతాడు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండీ అన్నీ తాత్కాలికమే అయిపోయాయి. అటు రాజధానీ తాత్కాలికం అన్నాడు. ఆ తర్వాత అసెంబ్లీ, సచివాలయం అన్నీ తాత్కాలికమే. ఇప్పుడు హైకోర్టు భవనాలు కూడా తాత్కాలికమేట. ప్రజలందరూ ఈ విషయం గురించి బాబును అపార్థం చేసుకుంటున్నారు. ఈ తాత్కాలిక చింతన బాబు మదిలో మెదలడానికి కారణం ప్రజలే కదా. ఈ రాష్ట్రంలో ఏదీ శాశ్వతం కాదని, తన పదవి అంతకంటే కాదని ఆయనకు తెలుసు. ఒకప్పటి  తొమ్మిదేళ్ల పాలనా శాశ్వతం కాలేదు, ఇప్పటి ఐదేళ్ల పాలన రేపు శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని గ్రహించాడు కనుకే దేన్నీ శాశ్వతంగా కట్టడం లేదు. నమ్మడం లేదు. చివరకు ప్రజలను కూడా. ప్రజాస్వామ్యంలో నేతకు ప్రజలు శాశ్వతం కాదు వాళ్లూ తాత్కాలికమే. వాళ్లకు తిక్కరేగిందా...ప్రభుత్వాలు తాత్కాలికం అయిపోతాయి అనే భావనలో ఉన్నాడు. అందుకే ప్రజలు కనిపించినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. నా పనికి కూలెందుకివ్వరు, నేనిచ్చే ఫించన్ తీసుకుంటూ నాకెందుకు ఓటేయ్యరూ అంటూ తర్కించుకుంటున్నాడు. ఆ తర్కం నుంచే ఈ అశాశ్వతం అనే భావన పుట్టుకొచ్చి ఉంటుంది. ఎలాగూ శాశ్వతం కాని పదవి కోసం, ఎలాగూ తనకు ఓటేయని ప్రజల కోసం శాశ్వత రాజధాని ఎందుకు కట్టాలి అన్నది ఆయన సిద్ధాంతం అయి ఉంటుంది. 

ఇక ఈ తాత్కాలికత బాబు చేపట్టిన రాజధాని నిర్మాణాల్లోనే కాదు చాలా విషయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చంద్రబాబు ఇచ్చే హామీలు తాత్కాలికం. ఒక్కసారి నంద్యాల ఎన్నికలు గుర్తు చేసుకోండి. కోట్ల రూపాయిల నిధులు అన్నాడు, రోడ్ల వెడల్పు అన్నాడు ఇంకా ఏవేవో అన్నాడు. ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకూ కూడా ఆ హామీలు అమలౌతున్నట్టే తాత్కాలిక ఆశను కల్పించాడు. ఎన్నికలయ్యాయి. బాబు తాత్కాలిక ఎత్తుగడ ఫలించింది. అంతే బాబు శాశ్వత విధానం అప్పుడు బైటపడింది. నంద్యాల్లో ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది. ఒక్క నంద్యాల ఉప ఎన్నికేంటీ, సాధారణ ఎన్నికలప్పుడూ జిల్లా జిల్లాకూ చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ తాత్కాలికమే కదా!! ఆ విషయం నిర్థారణ అయ్యింది కూడా ఆయన గెలిచిన తర్వాతే కదా!!!. ఇక జాతి అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం కూడా అంతే. ఆ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లు దీర్ఘకాలికమా, తాత్కాలికమా అనేది వాళ్లు చేసే పనులను బట్టే డిసైడ్ అవుతోంది. రుణమాఫీ కానీ, పావలా వడ్డీ రుణాలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, పెట్టుబడులు కానీ అన్నీ తాత్కాలికమే. 

ఇక ప్రారంభోత్సవాలూ, శంకుస్థాపనలు, హారతులు, నీరాజనాలు, ఉత్సవ్ లు, సమ్మిట్ లు సరే సరి. అవన్నీ డాం ష్యూర్ తాత్కాలికాలని అందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పటిదాకా తన మేనేజ్ మెంట్ స్కిల్ తో అవినీతి, అక్రమాల కేసులన్నిటిలో తెచ్చుకున్న స్టేలు కూడా తాత్కాలికమే అని. రేపు కట్టబోయే హైకోర్టు భవనాలు తాత్కాలికమైతే కావచ్చు, కానీ న్యాయం ఎప్పుడూ తాత్కాలికమైనది కాదు. అది బాబు అక్రమాలకు శాశ్వతంగా పులిస్టాప్ పెడుతుంది. కట్టిన శాసన సభ తాత్కాలికం కావచ్చు, కానీ చట్టాలను దుర్వినియోగం చేసిన వారికి ఎదురయ్యే ప్రజా వ్యతిరేకత తాత్కాలికం కాదు. బాబును శాశ్వతంగా అది మూలన  కూర్చోబెడుతుంది. శాశ్వతమైన ఓ మార్పు కోసం రాష్ట్ర ప్రజలు బాబును తాత్కాలికంగా భరిస్తున్నారని ఆయనకు ఈ పాటికైనా అర్థమైందో లేదో!

Back to Top