ఆలూ లేదూ చూలూ లేదు అల్లుడిపేరు చంద్రబాబు

 

అమరావతి ఓ భూతల స్వర్గం. అక్కడ నిలబడి ఏది చెబితే
అది నిజం అయిపోతుంది. ఇక్కడ విశ్వనగరం ఉంది అంటే చాలు విశ్వకర్మకు కూడా కళ్లుచెదిరేలాంటి
మాయా నగరం అదేనండి మహానగరం ప్రత్యక్షం అయిపోతుంది. లక్ష ఉద్యోగాలు అని అనగానే నిరుద్యోగులందరూ టై కట్టుకుని, షూ వేసుకుని ఉద్యోగాలకు
బయలుదేరిపోతూ మన కళ్లకు కనిపిస్తారు. అలాగే అమరావతిలో నిలబడి మూడు లక్షల ఇళ్లు అనగానే ముచ్చటైన
టూ బెడ్రూం ఇళ్లు సర్వాంగ సుందరంగా మన ముందుకు రెక్కలు కట్టుకుని వచ్చి వాలతాయి. అదంతా అమరావతి మహిమో
లేక అమరావతీనాథుడు నారా చంద్రబాబు నాయుడు మహిమో చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే బాబంటే అమరావతి
అమరావతంటే బాబు. ఆయన్ను చూస్తే రాజధాని అమరావతిని చూసినట్టే. ఆయన కట్టేస్తున్న పోలవరాన్ని
చూసినట్టే. అలాగే మూడులక్షల ఇళ్లనూ చూసినట్టే.

దేనికైనా విజన్ ఉండాలి
అంటారు బాబు గారు. అవును 2017కే పోలవరం పూర్తయిపోతుందని బాబుగారి ఆ విజనే చిలకజోస్యం
చెప్పింది. ప్రత్యేక హోదా వస్తుందని కూడా అదే విజన్ చెప్పింది. అలాగే హోదా కంటేప్యాకేజీ
గొప్పని, ప్యాకేజీ హోదా రెండూ సమానమని, ఆనక హోదా ఎందుకూ కొరగాదని కూడా చెప్పింది. ఆ విజనే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల
గురించి కూడా చెబుతోంది. రేపటి భవిష్యత్తును నేడే చూడటం, దాన్ని తన కళ్లతో ప్రజలకు చూపించడమే బాబు గారి బ్రహ్మాండమైన విజన్. ఇంత గొప్ప విజన్ వాసన్ కంటి ఆసుపత్రిలో కూడా దొరకదని
మనం సంబరపడాలి. దీన్ని
అరచేతిలో వైకుంఠం లాంటి పాత చింతకాయి సామెతలో పోల్చొద్దని మనవి.

నిరుడు బాబుగారు 2లక్షల ఇళ్లకు గృహప్రవేశం
చేసార్ట. ఈ ఏడాది ఆ రికార్డును ముక్కలు చెక్కలు చేసి 3లక్షల ఇళ్లకు గృహప్రవేశం
చేసార్ట. ఎంతటి అద్భుతమెంతటి అమోఘ మెంతటి చాతుర్యము. ఒక్కో ఇల్లూ చూద్దుము కదా సగం అయిన గోడలు, పునాదలు పూర్తి కాని
స్థలాలు, దర్వాజాలు లేని గదులు, స్లాబు లేని గోడలు నయనమనోహరంగా కనిపించాయి. ఇందులో ఏమి వింత ఉన్నది అంతుకు మించిన వింతలు ఉన్నాయి. నిరుడు పూర్తయి నివాసం
ఉంటున్న ఇళ్లకు మళ్లీ గృహప్రవేశాలు చేసారు తెలుగు తమ్ముళ్లు. పేదల ఇళ్ల లబ్దిదారులకు
అందించిన సొమ్ము తెలుగుదేశం పార్టీఅనుయాయులకు చేరగా విలాసవంతంగా కట్టిన ఇంద్రభవనాలకూ
అధికారులు, అధికార పార్టీ నేతలూ కలిసి గృహప్రవేశాలు జరిపారు.  బాబు గారి పాలనలో అమరావతి రాజ్యంలో ఇలాంటి వింతలకు
కొదవేలేదు. చూస్తుండండి ఎన్నికల సమయానికి రాష్ట్ర జనాభాకంటే రెట్టింపు ఇళ్లలో గృహప్రవేశం
చేయించి రికార్డులకెక్కే ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. 

Back to Top