బాబు, పవన్‌ వీర బాదుడు.. భారం రూ. 14వేల కోట్లు

31 Oct, 2024 19:38 IST

తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు, పవన్‌ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పోతిన మహేష్ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా పోతిన మహేష్ ఏమ‌న్నారంటే... 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.

దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.

సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.

మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు.

సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)

రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.

కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.