తురకపాలెం మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
గుంటూరు: తురకపాలెంలో ప్రజలు మెలిడియోసిస్‌తో చనిపోయారని చెప్పడానికి ప్రభుత్వం వెనకాడుతోందని, అలా చెబితే గ్రామంలో కలుషిత నీరు సరఫరా చేశామని అంగీకరించాల్సి భయపడుతున్నారని వైయస్ఆర్‌సీపీనాయకులు స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తురకపాలెంలో 45 మంది చనిపోయారన్న వారు, ఆ మరణాలనీ ప్రభుత్వ హత్యలే అని స్పష్టం చేశారు.
పత్తిపాడు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ బాలసాని కిరణ్ నేతృత్వంలో పార్టీకి చెందిన వైద్యులు, మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి గుంటూరు కలెక్టర్‌ను కలిసి, తురకపాలెంలో పరిస్థితిని వివరించారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నాయకులు ఏమన్నారంటే..:
తురకపాలెంలో ఎస్సీ కాలనీకి క్వారీ గుంతలో నీరు సరఫరా చేసిన విషయం బయటకొస్తుందని ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు. అక్కడ మెలిడియోసిస్ అని తెలిసీ 45 మంది చనిపోయేదాకా నిర్లక్ష్యం వహించిన నిందితులను శిక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన మరణాలు కాబట్టే వాస్తవాలు దాచి ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరించి బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి.
ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:
వరుస మరణాలకు కారణం చెప్పాలి: మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు
– తురకపాలెం గ్రామంలో కలుషిత నీరు తాగి ఇప్పటికే 45 మంది చనిపోయినా వారి మరణానికి గల కారణాలను వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మెలిడియోసిస్ కారణంగానే గ్రామస్తులు చనిపోయారని చెబితే ప్రభుత్వం కలుషిత నీరు సరఫరా చేసి వారి మరణాలకు కారణమైందని అంగీకరించాల్సి ఉంటుంది. ఆ 45 మంది మరణాలు కూడా ప్రభుత్వ హత్యలేనని సమాజం ముందు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నీరు మాకొద్దు బాబోయ్ అని ఎస్సీ, బీసీ కాలనీ వాసులు నిరసన తెలియజేసి గొంతుచించుకున్నా అదే నీటిని సరఫరా చేసి వారి చావులకు కారణమైనందుకు ఈ ప్రభుత్వ పెద్దలు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. పక్కనే ఉన్న ఇతర కాలనీలకు బోరు వాటర్ ఇచ్చి, బీసీ, ఎస్సీ కాలనీలకు మాత్రమే కుల వివక్షతో క్వారీ గుంతల్లో నిల్వ చేసిన నీటిని సరఫరా చేసినందుకు సమాజం ముందు ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సి ఉంటుంది. అందుకే గుట్టుచప్పుడు కాకుండా 29 మందికి మాత్రం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఎస్సీ కులాలకు చెందినవారు కాబట్టే వారి మరణాల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది. 45 మరణాలు సంభవించిన తర్వాత కూడా ఇప్పటికీ టెస్టులకు పంపించాం, రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్ చెప్పడం చూస్తుంటే వెనుబడిన కులాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలిసిపోతుంది. 45 మంది మరణాలు చూసిన తర్వాత ఇది మాకొక గుణపాఠం అని చెప్పి పశ్చాత్తాపం నటిస్తున్నారు. తురకపాలెం విషయంలో ప్రభుత్వం చేసిన పొరపాటును అంగీకరించడానికి ఈ ప్రభుత్వం ఇంకా భయపడుతోంది. కాబట్టే వారి మరణాలకు మద్యం, డయాబెటిస్ వంటి ఇతర కారణాలను చూపించి చేతులు దులిపేసుకుంటున్నారు. మెలిడియోసిస్ కారణంగా చనిపోయారని చెబితే 45 మంది ప్రాణాలు పోయేదాకా ఎందుకు చోద్యం చూశారని ప్రపంచం నిలదీస్తుందని ప్రభుత్వ పెద్దలు భయపడిపోతున్నారు. ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని చూపించి గుట్టుచప్పుడు కాకుండా ఈ అంశాన్ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతాదక్పథంతో ఆలోచించి మతుల కుటుంబాలకు న్యాయం చేయడంతోపాటు గ్రామంలో ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ చేయాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపే ప్రసక్తే ఉండదు.
గుంటూరులో ల్యాబ్ ఏర్పాటు చేయాలి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
– గుంటూరులో ల్యాబ్ లేకపోవడం వల్ల మరణాలకు గల కారణాలను గుర్తించడంలో తీవ్రజాప్యం జరిగింది. ఇప్పటికైనా గుంటూరు నగరంలో తక్షణం ల్యాబ్ ఏర్పాటు చేయాలి. టెస్టింగ్ దగ్గరలో జరిగితే వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం కూడా సులభం అవుతుంది. ఇప్పటికైనా అనుభవజ్ఞులైన సిబ్బందితో ల్యాబ్‌ని ఏర్పాటు చేయాలి.
బాధితులందరికీ ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి: వైయస్ఆర్‌సీపీ సత్తెనపల్లి ఇన్‌చార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
– గడిచిన నెల రోజులుగా తురకపాలెం గ్రామంలో జరుగుతున్న అనుమానాస్పద మరణాలపై వైయస్ఆర్‌సీపీప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. గ్రామంలో నిరంతరం పనిచేసేలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏడాదంతా నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే 45 మంది మెలిడియోసిస్ కారణంగా చనిపోయారు. ఇటీవలే 24 ఏళ్ల మహిళ కూడా ఇదే వ్యాధితో చనిపోయింది. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ తోపాటు అందుకు కావాల్సిన మందులు కేటాయించాలి. గ్రామస్తులకు సురక్షిత తాగునీటిని ఉచితంగా పంపిణీ చేయాలి. తూతూమంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలి.