లావణ్య మృతిపై లోతుగా విచారణ జరిపించాలి
జమ్మలమడుగు: మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యువతి లావణ్య మృతిపై లోతుగా విచారణ జరిపించి, మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ వాలంటీర్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జమ్మలమడుగులోని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లావణ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారని, అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, పత్రికల్లో వస్తున్న కథనాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. ఓ వస్త్ర దుకాణ యజమాని కుమారుడు పెళ్లి చేస్తానని నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేసి, రెండు సార్లు అబార్షన్ చేయించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
అంతేకాకుండా, తనపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి వద్ద రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు పంచాయతీ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం ఉందని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఈ విషయం తెలిసినా ఇప్పటివరకు పోలీసులు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
లావణ్య కేసును పూర్తిస్థాయిలో విచారించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో నిరుద్యోగ యువతులను మోసం చేసే ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ గట్టి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.