విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం అత్యంత విషాదకరం
తాడేపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్–2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. బాధితులను పరామర్శించి వారికి అవసరమైన సహాయం అందించాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ క్లిష్ట సమయంలో వైయస్ఆర్‌సీపీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.