ప్రతీ కార్యకర్తకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది
వైయస్ఆర్ జిల్లా: ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్... కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్ భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైయస్ జగన్ సూచించారు.
అంతకుముందు పులివెందులలో దారిపొడవునా తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ, ఆగి పలకరిస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.