మార్కాపురం బస్సు ప్రమాదంపై వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి

26 Mar, 2026 10:05 IST

 తాడేపల్లి: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైయ‌స్‌ జగన్‌ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైఎస్‌ జగన్‌ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.