వైయస్.జగన్ ప్రభుత్వం లోనే డేటా సెంటర్ ఏర్పాటుకు ఆదానీతో ఒప్పందం

25 Oct, 2025 17:09 IST

రాజమండ్రి: వైయస్.జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే విశాఖలో గూగుల్ డేటాసెంటర్ ఏర్పాటులో చంద్రబాబు, లోకేష్ లు  ఆదానీ పేరు చెప్పకుండా చివరి వరకు ప్రచారం చేసుకోవడంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ఒక బిల్డింగ్ కట్టి ఆంతా తానే చేశానని చెప్పుకోవడం బాబుకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, రాజమండ్రి, తుని ఘటనలే ఇందుకు నిదర్శనమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ అఘాయిత్యాలకు కారణమని, ఇంత జరుగుతున్న ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆక్షేపించారు. కర్నూలు బస్ ప్రమాదంలో చనిపోయిన వారికి పార్టీ తరపున సంతాపం ప్రకటించిన భరత్... ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 ఈ సందర్బంగా ఇంకా ఆయన ఏమన్నారంటే..

● చంద్రబాబు తప్పుడు ప్రచారం...

చంద్రబాబు నాయుడు తానే హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చానని చెప్పుకుంటున్నాడు.  ఆ తర్వాతే సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్ లో చేరాడు అని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయితే... వికీ సమాచారం ప్రకారం సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్ లో 1992లో చేరారు. సుందర్ పిచాయ్ గూగుల్ డేటా సెంచర్ గురించి మాట్లాడుతూ ప్రధానితో మాట్లాడానని చెబితే... అది కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. 
వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆదానీ కంపెనీ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు పునాదులు వేశారు. సబ్‌సీ కేబుల్ ఏర్పాటుకు సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఆరోజే చ‌ర్చించ‌డం జ‌రిగింది.  ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఆదానీ, ఎయిర్ టెల్,  గూగుల్ సంయుక్తంగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు  సుందర్ పిచాయ్ చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ఆదానీ భాగస్వామ్యం గురించి చెబితే... వైయస్.జగన్ కు క్రెడిట్ వస్తుందన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఆదానీ పేరు కూడా ప్రస్తావించడం లేదు. ఐటీకి నేనే ఆద్యుడుని, హైదరాబాద్ లో ఐటీ నేనే తెచ్చానని చెప్పుకోవడం చంద్రబాబుకి అలవాటు.. కానీ ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని బెంగుళూరుని చెబుతారు. హైదరాబాద్ కి చంద్రబాబు చేసిందేమీ లేదు.  అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే, శంషాబాద్ ఇంటర్నేరేషల్ ఎయిర్ పోర్టు కూడా వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మిస్తే.. చంద్రబాబు చేసిందేమిటి? ప్రజలు మీ మాటలు విని, నవ్వుకుంటున్నారన్న జ్ణానం కూడా లేకుండా పోయింది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ కి చంద్రబాబు చేసింది ఏమీ లేదు, ఒక బిల్డింగ్ మాత్రం కట్టి అంతా నేనే చేశానని చెప్పుకోవడం అలవాటుగా మారింది. 

● ప్రభుత్వ నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు...

ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్నూలు వద్ద ప్రమాదంలో దహనమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ఏడాదిన్నరగా  ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేదు. ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతుంటే అధికారులు, ప్రభుత్వం నిద్రపోతున్నారా? అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేస్తే రాష్ట్రంలో ఇలాంటి వాహనాలు లక్షల్లో బయటపడతాయి. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు?  ప్రభుత్వానిది కాదా? వీరిపై సుమోటోగా సుప్రీంకోర్టు, హై కోర్టుల్లో కేసులు వేయాలి. 19 మంది ప్రాణాలను అన్యాయంగా హరించారు. ప్రమాదానికి గురైన బస్సుకు ఇన్సూరెన్స్ లేదు, బస్సుపై 16 ఇ- చలాన్లు ఉన్నాయి.  ఇంతటి నిర్లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి కొనసాగే నైతిక అర్హత లేదు. 

● రాష్ట్రంలో రక్షణ కరువైన చిన్నారులు, మహిళలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదు. వీరిపై దాడులు, మానభంగాలు జరుగుతున్నా... ప్రభుత్వ చర్యలు శూన్యం. రాజమండ్రి హాస్టల్ లో పదోతరగతి చదువుతున్న బాలికను దీపావళి రోజున హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు లైంగికంగా లోబర్చుకుంటే... పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారు. ఇంత దారుణం జరుగుతున్నా
 స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వెలుగులోకి రాని దుర్ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ ఘటనపై బీసీ హాస్టల్ ముందు ధర్నా చేస్తే.. మా పై తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు. ఘటనపై ఆగ్రహంతో ఉన్న మహిళలు హాస్టల్ ఎదురుగా స్థానిక ఎమ్మెల్యే వాసు బ్యానర్ చూసి ఆగ్రహంతో అనూయాదవ్ అనే మహిళ పేడ జల్లితే.. 10 మంది పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. దాదాపు 3 గంటలపాటు ఆమెను నిర్భంధించారు. హాస్టల్ లో బాలికకు రక్షణ కల్పించలేని పోలీసులు, ప్రభుత్వం తీరుపై ఆవేదనతో నిరసన తెలియజేస్తే అరెస్టు చేస్తారా ? 41 ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత మరలా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు కాదా? ప్రశ్నిస్తే మా పై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. 
ఈ అకృత్యాలకు రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే కారణం. 24 గంటలూ మద్యం దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. ఇది చాలదన్నట్టు అధికార పార్టీ నేతలే ఏకంగా కల్తీ మద్యం తయారీ కుటీరపరిశ్రమలా చేపడుతూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. రాజమండ్రిలో లిక్కర్ సిండికేట్ సంభాషణలో లీకేజీలతో అసలు విషయం తేటతెల్లమవుతుంది. 
రాష్ట్రంలో విచ్చవిడిగా ఉన్న పేకాట క్లబ్బులపై డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ విచారణకు ఆదేశిస్తే... గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ గోదావరి జిల్లాల్లో పేకాట సహజం అని మాట్లాడ్డం విడ్డూరం. 
రాజమండ్రిలో కూడా విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు ఇసుక, మద్యం , భూసెటిల్మెంట్, స్పా సెంటర్లు అన్నీ ఈవీఎం ఎమ్మెల్యే అండదండలతో నడుస్తున్నాయి. 

రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సభ్యత, సంస్కారం లేకుండా  మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావటం వల్లే అరాచకాలు జరుగుతున్నాయి. ఆదిరెడ్డి కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైయ‌స్ఆర్‌సీపీలో ఎమ్మెల్సీ పదవి పొంది టిడిపి అధికారంలోకి రాగానే అందులోకి దూకిన మీరు నీతులు చెప్పడం విడ్డూరం. వైయస్ జగన్ భిక్షతో మీ తండ్రి ఎమ్మెల్సీ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే మా పై కేసులు పెడుతున్నారు. 
పోలీసులు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా పనిచేయవద్దు. వంద కేసులు పెట్టినా ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం. కుమ్మక్కు రాజకీయాలు స్థానిక ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. అన్నీ త్వరలోనే భయటపెడతామన్నారు. 

అనంతరం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...  
ఈ నెల 28వ తేదీన చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పార్టీ నేతలతో కలిసన భరత్ విడుదల చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.