రాయలసీమ ద్రోహి చంద్రబాబు

18 Jul, 2025 16:35 IST

కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అన్యాయానికి రాయలసీమ పేరు ఎత్తే అర్హత కూడా ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం కోసం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కనీసం ఒక్క ప్రాజెక్ట్‌ను అయినా సాధించారా అని ప్రశ్నించారు. నేడు రాయలసీమను రతనాల సీమ చేస్తానంటూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారని ధ్వజమెత్తారు. 1998 లో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను కేవలం తాగునీటికే వాడుకోవాలంటూ చంద్రబాబు జీఓ ఇచ్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు వ్య‌వ‌సాయ, నీటి పారుద‌ల రంగాల‌పై ఏమాత్రం దృష్టి పెట్ట‌కుండా కేవలం కాలం వెళ్ల‌దీసే మాట‌ల‌తో రైతుల‌ను మ‌భ్య‌పెడుతూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికీ అదే పంథాను అవ‌లంభించి ల‌బ్ధిపొందాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా నిన్న‌టి చంద్ర‌బాబు క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌తో రైతులంద‌రికీ అర్థ‌మైపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు 16 ఏళ్లు సీఎంగా చేసిన చంద్ర‌బాబు ఆయ‌న మొద‌లుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. ఇప్ప‌టికీ రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాన‌ని మ‌భ్య‌పెట్టి మోసం చేసే మాట‌లు చెబుతున్నాడు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్టీఆర్ హ‌యాంలో తెలుగు గంగ ప్రాజెక్టును మొద‌లుపెట్టి హంద్రీనీవా గాలేరు- న‌గ‌రి సుజ‌ల స్ర‌వంతి ప్రాజెక్టుల‌కు నామ‌క‌ర‌ణం చేసి శంకుస్థాప‌న‌తోనే వ‌దిలేశారే కానీ ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు ప‌దేళ్లు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ సాగునీటి ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌సాయం దండ‌గ‌, ఉచిత క‌రెంట్ దండ‌గ అని ఆత్మ‌క‌థ‌లు రాసుకుంటూ కాల‌క్షేపం చేశాడు. తెలుగు గంగ‌ను అలాగే వ‌దిలేశాడు. హంద్రీనీవా, గాలేరు న‌గ‌రి ప్రాజెక్టులు అస‌లే వ‌ద్ద‌ని చెప్పాడు. బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ ఏర్పాటు కాక‌మునుపు ఆరోజుల్లో ఈ ప్రాజెక్టును చంద్ర‌బాబు క‌నీసం 5 శాతం పూర్తి చేసి ఉన్నా ఈరోజు మిగులు జలాల కోసం కాకుండా నిక‌ర జలాలే ఆ ప్రాజెక్టుకి కేటాయించ‌బ‌డేవి. ఆ విధంగా రాయ‌ల‌సీమ‌కు ద్రోహం చేసిన చంద్ర‌బాబు, హంద్రీనీవా ప్రాజెక్టును నేనే మొద‌లుపెట్టి పూర్తి చేశాన‌ని చెప్పుకోవడం కన్నా దారుణం మ‌రోటి ఉండ‌దు.  

సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చి మోస‌గించాడు 

హంద్రీనీవాను 40 టీఎంసీల‌తో చేయాల‌ని దివంగ‌త ఎన్టీఆర్ జీవో ఇస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక 1998 మే 6న హంద్రీనీవా సాధ్య‌ప‌డే ప్రాజెక్టు కాద‌ని చెబుతూ దాన్ని తాగునీటి ప్రాజెక్టు కింద‌కి మారుస్తూ ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని కూడా 5 టీఎంసీల‌కు కుదించి ఎన్నిక‌ల‌కు ముందు జీవో ఇచ్చాడు. 1999లో ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌నులు మొద‌లుపెడ‌తామ‌ని మ‌ళ్లీ శంకుస్థాప‌న చేసి ఒక్క త‌ట్ట మ‌ట్టి కూడా ఎత్త‌లేదు. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. దివంగ‌త వైయ‌స్ఆర్‌ 2004 లో సీఎం అయ్యాక ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుగంగ ప్రాజెక్టును పూర్తి చేయ‌డ‌మే కాకుండా హంద్రీనీవా గాలేరు న‌గ‌రి ప్రాజెక్టుల‌ను మొద‌లు పెట్టాల‌నే ఉద్దేశంతో 1998లో తాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ చంద్ర‌బాబు ఇచ్చిన జీవోను ర‌ద్దు చేశారు. ప్రాజెక్టును 5 టీఎంసీల నుంచి 40 టీఎంసీల‌కు పెంచుతూ ఫేజ్-1కి రూ.1400 కోట్లు ఫేజ్‌-2కి 1500 కోట్లు కేటాయిస్తూ  ముఖ్య‌మంత్రి అయిన రెండు నెల‌ల్లోనే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కుప్పంకి కూడా నీళ్లివ్వాల‌ని వైయ‌స్ఆర్‌ ఆరోజే నిర్ణ‌యించారు. అనంత‌పురం ఎడారిగా మారిపోతున్న దుస్థితి నుంచి జిల్లాను గ‌ట్టెక్కించారు. క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ‌, ఆలూరు వంటి మెట్ట‌ ప్రాంతాల‌తో పాటు క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల‌ను ఈ ప్రాజెక్టుతో స‌స్య‌శ్యామ‌లం చేశారు. క‌రువు ప్రాంతంగా ఉన్న అనంత‌పురం జిల్లా నేడు దేశంలోనే హార్టీక‌ల్చ‌ర్‌లో మొద‌టిస్థానంలో ఉందంటే అది వైయ‌స్ఆర్‌ చ‌ల‌వే. వైయ‌స్ఆర్‌ క‌ట్టిన గొల్ల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ కార‌ణంగానే కియా ప‌రిశ్ర‌మ ఏర్పాటైన విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. రాయ‌ల‌సీమ‌లో సాగునీటి ప్రాజెక్టుల‌ను మొద‌లుపెట్టి ప‌రుగులు పెట్టించిన వైయ‌స్ఆర్‌ ని స్మరించ‌కుండా నేనే చేశాన‌ని చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. రాయ‌ల‌సీమ కోసం ఆనాడు వైయ‌స్ఆర్‌ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ప‌నులు మొద‌లుపెడితే త‌న పార్టీకి చెందిన దేవినేని ఉమాతో ప్ర‌కాశం బ్యారేజీ మీద జ‌ల‌దీక్ష పేరుతో కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని చూశాడు. వైయ‌స్ఆర్‌ చేసిన ప‌నుల‌ను త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా వ‌చ్చిన కిర‌ణ్‌కుమార్ రెడ్డి కొంత‌వ‌రకు నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లారు. 

వైయ‌స్ఆర్‌ హ‌యాంలోనే 'మ‌ల్లెల' పూర్త‌యింది 

'మ‌ల్లెల' నుంచి నీరు వ‌దిలిన త‌ర్వాత వైయ‌స్ఆర్‌ దాన్ని ప్రారంభోత్స‌వం చేద్దామ‌నుకునే లోప‌ల చ‌నిపోయారు. ఆయ‌న తిరుప‌తికి పోతూ శ్రీశైలం ప్రాజెక్టుకి నీరు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయి. రాయ‌ల‌సీమకి నీరు ఎలా ఇవ్వొచ్చు చూసి వెళ‌దామ‌ని పైలెట్‌కి ఆదేశాలిచ్చారు. ఆ క్ర‌మంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న మ‌ర‌ణించారు. అంత గొప్ప వ్య‌క్తి సేవ‌ల‌ను చంద్ర‌బాబు క‌నీసం స్మరించుకోకుండా తానే చేశాన‌ని చెప్ప‌డం క‌న్నా విడ్డూరం ఇంకోటి ఉండ‌దు. 2012లో అనంత‌ వెంక‌ట్రామిరెడ్డి, ర‌ఘువీరారెడ్డి మ‌ల్లెల నుంచి నీరు వ‌దిలి గొల్ల‌ప‌ల్లి వ‌ర‌కు నీరు ఇవ్వాల‌నే ఉద్దేశంతో జీడిప‌ల్లి వ‌ర‌కు న‌డుచుకుంటూ వెళ్లారు. నిన్న ఢిల్లీ నుంచి వ‌చ్చిన చంద్రబాబు నీరు విడుద‌ల చేసి మ‌ల్లెల నేనే పూర్తి చేశాన‌ని చెబుతున్నాడు. చంద్ర‌బాబుకి సాగునీటి రంగంమీద అవ‌గాహ‌న ఉంటే 2004లో వైయ‌స్ఆర్‌ ఇచ్చిన జీవోకి 1998లో ఆయ‌నిచ్చిన జీవోల‌కు ద‌మ్ముంటే ఆయ‌న కానీ ఆయ‌న పార్టీ నాయ‌కులు కానీ స‌మాధానం చెప్పాలి. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత‌  వైయ‌స్ఆర్‌ చేసిన ప‌నుల‌ను ముందుకు తీసుకెళ్ల‌కుండా బిల్లుల చేసి జేబులు నింపుకోవ‌డానికి కేవ‌లం మ‌ట్టి ప‌నులు మాత్ర‌మే చేశాడు. 

వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో రూ. 40 వేల కోట్ల‌తో 33 ప్రాజెక్టులు 

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక వైయ‌స్ఆర్‌ చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను ముందుకు తీసుకెళ్లారు. రాయ‌ల‌సీమ‌ను దుర్భిక్ష ప‌రిస్థితుల‌ను పార‌ద్రోలాల‌నే ల‌క్ష్యంతో రాయ‌ల‌సీమ డ్రౌట్ మిటిగేష‌న్ అనే కార్పొరేష‌న్‌ని మొద‌లుపెట్టారు. స్పెష‌ల్ ప‌ర్సస్ వెహిక‌ల్ కింద 33 ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి వాటి కోసం రూ. 40,300 వేల కోట్లు ఖ‌ర్చు చేయాలి నిర్ణ‌యించారు. అందులో భాగంగా మొద‌లుపెట్టిందే రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు. దానికి రూ.800 కోట్లు ఖ‌ర్చు పెట్టి ప‌నులు దాదాపూ పూర్తి చేశారు. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉండి కూడా ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో ఈ ప్రాజెక్టును ప‌క్క‌న‌పెట్టిన చంద్ర‌బాబుని ఏమ‌నాలి.? పోల‌వ‌రం- బ‌న‌క‌చ‌ర్ల అనే కొత్త కాన్సెప్టు తీసుకొస్తున్నాడు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి ఎంతో ముఖ్య‌మైన రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్‌ను మూల‌న‌ప‌డేశారు. అమ‌రావ‌తికి రూ. ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడ‌ని రాయ‌ల‌సీమ వాసులు నిల‌దీయ‌కుండా రూ.90 వేల కోట్లతో బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును చేప‌డ‌తాన‌ని చంద్ర‌బాబు క‌బుర్లు చెబుతున్నాడు. మొబిలైజేష‌న్ అడ్వాన్సుల పేరుతో క‌మీషన్లు తీసుకోవ‌డానికే చంద్రబాబు బ‌న‌క‌చ‌ర్ల గురించి మాట్లాడుతున్నాడు. ఆనాడు అన్ని అనుమ‌తులుంటేనే వైయ‌స్ఆర్‌ ప్రాజెక్టుల‌ను మొద‌లుపెట్టారా.? ప్రాజెక్టుల‌ను క‌ట్టాలంటే సంక‌ల్పం కావాలి. మొద‌లుపెడితే అనుమ‌తులు వాటిక‌వే వ‌స్తాయ‌ని వైయ‌స్ఆర్‌ నిరూపించారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల మీద చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధి ఉంటే గుండ్రేవుల‌, వేదావ‌తి, హెచ్ఎన్ఎస్ఎస్- జీఎన్ఎస్ఎస్ క‌లిపే లింకు ప్రాజెక్టును చేప‌ట్టాలి. రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ బ్యాలెన్స్ వ‌ర్కు పూర్తి చేయ‌డంతోపాటు హెచ్ఎన్ఎస్ఎస్ 6 వేల క్యూసెక్కుల‌కు తీసుకెళ్లాలి.  

కుప్పానికి నీరిచ్చిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌దే

2400 క్యూసెక్కుల నీటిని త‌ర‌లించడానికి కాలువ‌ల సామ‌ర్థ్యం స‌రిపోవ‌డం లేద‌ని వాటిని పెంచాల‌ని 2021లో 6 వేల క్యూసెక్కుల‌కు పెంచుతూ రూ.6 వేల కోట్లు విడుద‌ల చేస్తూ వైయ‌స్ జ‌గ‌న్ జీవో ఇచ్చారు. కుప్పానికి కూడా నీరిచ్చిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. ఇరిగేష‌న్ అనేది వైయ‌స్ కుటుంబానికి బ్రాండ్‌. మాట‌లు చెప్పుకున్నంత మాత్రాన చంద్ర‌బాబు చేసిన‌ట్టు కాదు. హెచ్ఎన్ఎస్- జీఎన్ఎస్ఎస్‌లో చంద్ర‌బాబు పాత్ర ఏంటో చెప్పాలి. పోల‌వ‌రం ప్రాజెక్టును కూడా వ‌ద్ద‌న్న మ‌హానుభావుడు చంద్ర‌బాబు. పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ప్ర‌కాశం జిల్లాలో ఉద్యమాలు చేస్తే కేసులు పెడ‌తామ‌ని చంద్ర‌బాబు బెదిరించాడు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు 24 అనుముతులు కావాల్సి ఉంటే 23 అనుమ‌తులు దివంగ‌త వైయ‌స్సారే సాధించుకొచ్చారు. కుడి, ఎడమ కెనాల్‌ల తోపాటు స్పిల్ వే కూడా ఆయ‌నే మొద‌లుపెట్టారు. చంద్రబాబు సీఎం అయ్యాక కేంద్రం చేప‌ట్టాల్సిన ప్రాజెక్టును తెచ్చుకుని క‌మీష‌న్లు దండుకోవ‌డ‌మే కాకుండా పోల‌వ‌రం ప్రాజెక్టును నాశ‌నం చేశాడు. రాయ‌ల‌సీమ‌కు వైయ‌స్ జ‌గ‌న్ కేటాయించిన హైకోర్టు, లా యానివ‌ర్సిటీల‌ను త‌ర‌లించుకుపోయి, కర్నూలు ప్ర‌జ‌ల‌ను మోసం చేసి రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తాన‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నాడు. 


రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబుకి వివ‌క్ష‌. అమ‌రావ‌తి మీద‌నే ఆయ‌న‌కు ప్రేమ‌
:  కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి 

రాయ‌ల‌సీమ‌ను రాళ్ల‌సీమ‌గా మార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. ప్రాజెక్టుల కోసం ఆయ‌న చేసిన ఖ‌ర్చంతా కూడా ప‌బ్లిసిటీ కోసం చేసిందే. 1994-2004 వ‌ర‌కు ప‌దేళ్ల‌లో 2014-19 మ‌ధ్య ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఎంతెంత ఖ‌ర్చు చేశారో చంద్ర‌బాబు చెప్పాలి. హంద్రీనీవా ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు టెంకాయ‌లు కొట్టేసి పోతే, వేల కోట్లు ఖ‌ర్చు చేసి కాలువ‌లు తీసి రిజ‌ర్వాయ‌ర్లు క‌ట్టించింది వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబుకి ఎలాంటి ప్రేమ లేదు. అమ‌రావ‌తి పేరుతో చంద్ర‌బాబు చేసే రూ. ల‌క్ష కోట్ల అప్పు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి మీదా ప‌డుతుంది. తెలంగాణ అడ్డుకుంటుంద‌ని తెలిసే బ‌న‌క‌చ‌ర్ల పేరుతో చంద్ర‌బాబు డ్రామాలాడుతున్నాడు. క‌ళ్ల ముందున్న శ్రీశైలం నుంచి నీరు ఇవ్వ‌మ‌ని అడుగుతుంటే ఎక్క‌డి నుంచో పోల‌వ‌రం ద్వారా బ‌న‌క‌చ‌ర్ల నుంచి ఇస్తానంటున్నాడు. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు రాయ‌ల‌సీమ‌కు రూ.90 వేల కోట్ల‌తో ప్రాజెక్టులు అవ‌స‌రం లేదు. రూ. ఐదారువేల కోట్లు ఖ‌ర్చు చేసినా రాయ‌ల‌సీమ పెండింగ్ ప్రాజెక్టుల‌న్నీ పూర్త‌వుతాయి. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని శ్రీశైలం జ‌లాల‌ను కేసీఆర్ క‌రెంట్ ఉత్ప‌త్తికి వాడుకుంటున్నా చంద్ర‌బాబు అడ్డుకోలేదు. వైయ‌స్ జ‌గ‌న్‌కి ధైర్యం ఉంది కాబ‌ట్టే మ‌న నీటి కోసం పోలీసుల‌ను పంపించి మ‌రీ త‌ర‌లించుకున్నాడు. ఓటుకు నోటు కేసులో విచార‌ణ‌కు వెళ్లినప్పుడైనా రేవంత్‌రెడ్డితో మాట్లాడి గుండ్రేవుల‌కు చంద్ర‌బాబు ప‌ర్మిష‌న్ తీసుకురావాలి. బ‌న‌క‌చ‌ర్ల పేరుతో చంద్ర‌బాబు డ్రామాలు చేయ‌డం ఆపాలి. చంద్ర‌బాబుకి ప‌బ్లిసిటీ మ‌రీ ఎక్కువైపోయింది. రూ. నాలుగు వేలు పింఛ‌న్ పంపిణీ చేయ‌డానికి నెల‌నెలా రూ. 4 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడు. ఇంత చీప్ ప‌బ్లిసిటీ చేసుకునే వ్య‌క్తిని నా జీవితంలో చంద్ర‌బాబునే చూస్తున్నా. వైయ‌స్ జ‌గ‌న్ అంటే టీడీపీలో భ‌యం మొద‌లైంది. ఆయ‌న్ను, ఆయ‌న కోసం వ‌చ్చే జ‌న ప్ర‌భంజనాన్ని అడ్డుకోవ‌డం టీడీపీ వ‌ల్ల కాదు. రాయ‌లసీమ నుంచి ఎల‌క్ట్రీసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ని త‌ర‌లించాల‌ని చూస్తున్నారు. పులివెందుల మెడిక‌ల్ కాలేజీ సీట్ల‌ను వెన‌క్కి ఇచ్చేశారు. ఆదోని, హిందూపురం, నంద్యాల‌ మెడిక‌ల్ కాలేజీ నిర్మాణ పనులను ఆపేశాడు. చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయే అమాయ‌కులు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు కాదు. బుద్ధి చెప్పే టైం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా బుద్ధి చెబుతారు.