డయేరియా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

21 Oct, 2024 19:30 IST

విశాఖపట్నం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత, బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. డయేరియాతో మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధిత గ్రామాలను తక్షణమే రెడ్‌ జోన్‌గా ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం క్యాంప్‌ ఆఫీస్‌లో  శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

    డయేరియా మృతులపై ప్రభుత్వం గందరగోళ లెక్కలు చెబుతోందన్న మండలి విపక్షనేత, మరణాల సంఖ్యతో సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. జిల్లా కలెక్టర్‌ లెక్క మేరకు ఒక్కరు చనిపోగా, చంద్రబాబు లెక్క 8 మంది అని, పవన్‌కళ్యాణ్‌ లెక్క 10 మంది అని తెలిపారు. ఎందుకీ గందరగోళం? ఎందుకింత అస్పష్టత? అన్న బొత్స, పాలన చేతకాక, అధికారులపై పట్టు లేకనేనా? అని గట్టిగా నిలదీశారు.
    గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నారని, రుషికొండ నిర్మాణాలపై అనుమానాలు ఉంటే, నిరభ్యరంతంగా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.
    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై షర్మిల అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న బొత్స, నాడు ఆ మొత్తం పిల్లల తల్లుల ఖాతాల్లో వేసేందుకు (డీబీటీ) ప్రభుత్వం సిద్ధమైతే, కోడ్‌ పేరుతో కోర్డును ఆశ్రయించింది ఇప్పటి పాలకులే అన్న విషయం షర్మిలకు తెలియదా? అని చురకలంటించారు.
    
గుర్ల మండంలో కలుషిత నీటి సరఫరాకు కూటమి ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోందన్న మండలి విపక్షనేత.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయక నిర్వహణ లోపం అని ఒకసారి, ఫిల్టర్‌ పాయింట్స్‌ మార్చలేదని మరోసారి చెబుతూ, ఆ మరణాలపైనా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని గుర్తు చేశారు. డయేరియా వ్యాప్తి చెందిన ఆ ఏడెనిమిది గ్రామాల్లో వెంటనే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయడంతో పాటు, మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఏ చర్యలు తీసుకోబోతున్నారో సీఎం చెప్పాలని కోరారు. డబ్బుల వసూళ్లకు కక్కుర్తిపడి నీటి సరఫరా పర్యవేక్షణను పూర్తిగా వదిలేశారన్న మండలి విపక్షనేత.. కూటమి నేతలు, అధికారులు వస్తే, నాలుగు నెలలుగా అక్కడి దారుణస్థితిని చూపిస్తానని సవాల్‌ చేశారు. 

డయేరియా మరణాలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. పవన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ, ఈరోజు రుషికొండలో పర్యటించి, అక్కడి భవనాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశామంటూ విమర్శిస్తున్నారని బొత్స గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైయస్సార్‌గారు సీఎంగా ఉన్నప్పుడే, హైదరాబాద్‌లో సీఎం ఇల్లు, క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మిస్తే, ఆ తర్వాత వచ్చిన వారు అక్కడి నుంచే పాలించారని ప్రస్తావించారు. అదే తరహాలో విశాఖ రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మిస్తే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.