మామిడి రైతులు కన్నీరు పెడుతున్నా.. కనిపించడం లేదా?
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో 56వేల ఎకరాల్లో మామిడి సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నా, కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మామిడి రైతుల గోడుపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ఖచ్చితంగా కేజీ రూ.8 చొప్పున కొనుగోళ్ళు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి వైయస్ఆర్‌సీపీ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దమవుతుందని హెచ్చరించారు. మామిడి రైతుకు న్యాయ జరిగే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం నిద్రపోతుందా?
చిత్తూరు జిల్లా మామిడికి కనీస గిట్టుబాటు రేటు కూడా దక్కకపోవడం, ఫ్యాక్టరీలు కొనుగోళ్ళు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తుండటం, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మామిడి దిగుమతులు జరిగిపోతున్నా ప్రభుత్వం నిద్రపోతోందా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఒకవైపు చిత్తూరు జిల్లాకు చెందిన మామిడి రైతులు తమ పంటలను ట్రాక్టర్లో తీసుకువచ్చి ఫ్యాక్టరీల ముందు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, పొరుగు రాష్ట్రాల మామిడి లోడ్ వాహనాలు నేరుగా ఫ్యాక్టరీల్లోకి నేరుగా వెళ్ళిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా? అధికార యంత్రాంగాన్ని పనిచేయించుకోలేని అసమర్థ స్థితిలో ఉన్నారా అని నిలదీశారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశామని చెబుతున్నారు, అలాంటప్పుడు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల వాహనాలు ఎలా ఏపీలోని ఫ్యాక్టరీలకు వస్తున్నాయి? కొందరు ఫ్యాక్టరీ నిర్వాహకులతో కూటమి నాయకులు కుమ్మకై, చిత్తూరు జిల్లా మామిడి రైతులను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంత దౌర్భగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
`రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్లు ఎక్కడైనా కిలో మామిడి రూ.8 కి కొనుగోలు చేస్తున్నారా? నిరూపించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా? నేరుగా ఫ్యాక్టరీల వద్దకు వచ్చి, రోజుల తరబడి మామిడి పంటతో వేచి ఉన్న రైతులతో ఈ మాట చెప్పించగలరా? ఇంత దౌర్భగ్య పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. చిత్తూరు మామిడి రైతుల మీద ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉందో అర్థం కావడం లేదు. చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఇదే అదునుగా పల్ప్ ఫ్యాక్టరీలు, మామిడి వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. తోతాపురి రకం అమ్ముడుపోక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలంటూ రైతులు రోడెక్కారు, పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్లు, నీలం 5,818, అల్పోన్సో 3,127, బేనీషా 3,895, మల్లిక 1,740 హెక్టార్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లలో సాగవుతోంది. ఇప్పటికే మామిడి కోతలు పూర్తి చేసిన రైతులు పంట అమ్ముకునేందుకు చిత్తూరు, పలమనేరు, దామలచెరువు, బంగారుపాళ్యం ఇతరాత్ర మార్కెట్లకు తరలివస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం సాగవుతోంది. ఈ కాయలు 90శాతం దాకా పక్వానికి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 39,895 హెక్టార్లకు గాను 4,99,274 మెట్రిక్ టన్నుల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. టేబుల్ రకాలను మాత్రం రైతులు కోతకోసి మార్కెట్, ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. తోతాపురి పంటను ఫ్యాక్టరీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు దీనిపై ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కారు. రైతుల ఆగ్రహం చూసిన కూటమి ప్రభుత్వం కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఫ్యాక్టరీలను ఆదేశించి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం తరఫున కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక నిధి ఇస్తామని గొప్పగా ప్రకటించింది. ఎక్కడా ఇది అమలు జరగడం లేదు.
అరకొర టొకెన్లు ..
అధికారుల పోరు పడకలేక కొన్ని ఫ్యాక్టరీలు కాయల కొనుగోలు చేస్తామంటూ టోకన్ల సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలు జారీ చేసే టోకన్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఫ్యాక్టరీలు మాత్రం అరకొర టొకెన్లు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. మిగిలినవి కూటమి పార్టీలు చెప్పిన వారికే జారీ చేస్తున్నాయి. సిఫారస్లు తెచ్చుకుంటేనే టోకెన్లు అంటూ ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడులోని క్రిష్ణగిరి, ఇతరాత్ర ప్రాంతాల నుంచి వచ్చే కాయలకు జిల్లాలోని ఫ్యాక్టరీలు తక్కువ రేటుకు కొంటున్నాయి. తోతాపురి కిలో రూ.4, రూ.5కు కొనుగోలు చేస్తున్నాయి. పక్కరాష్ట్రాల వ్యాపారులు రూ.5కే ఫ్యాక్టరీకి డెలివరీ ఇస్తున్నారని జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీలకే కొమ్ముకాస్తూ, రైతులకు ఏదో చేస్తున్నట్లుగా డ్రామాలు ఆడుతోంది. పరిశ్రమల వద్ద అధికారులు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీలు రూ. 8, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ క్రింద రూ. 4, వెరసి రూ. 12 లు కేజీ కి వస్తుంది అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం మేము ఇచ్చేది రూ. 6 మాత్రమే, ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో మాకు తెలవదు అంటున్నారు.
దోపిడీ దొంగలు రాజ్యం
గతం లో ఫ్యాక్టరీలు ఒక వారం లోపల పంపిన కాయలకు డబ్బులు చెల్లించే వారు. ఇప్పుడు 3 నెలలు కు పైన చెల్లిస్తాం, ఇష్టం ఉంటె తోలండి లేకుంటే లేదు అని రైతులకు తెగేసి చెప్పుతున్నారు. అంటే రైతులను వీళ్ళు ఎంత దగా చేస్తున్నారో అర్థమవుతోంది. పల్ప్ ఫ్యాక్టరీలు ఇలా ఉంటె, ఇక ర్యాంపులు, మండి యాజమాన్యాల నిలువు దోపిడీ చెప్పనలవి కాదు. కేజీ తోతపురికి రూ. 4 ఇస్తున్నారు. ఎక్కడ చూసిన దోపిడీ దొంగలు రాజ్యం ఏలుతున్నారు. 3 సంవత్సరాలనుండి తెగుళ్ళు, పురుగులు ఉధృతి కారణంగా 8 నుండి 10 సార్లు పురుగు మందులు పిచికారీ చేయవలసిన పరిస్థితి. గతంతో పోలిస్తే పురుగు మందుల ధరలు 200 శాతం పెరిగాయి. కూలీలకు రోజుకు 600 రూపాయలు భోజనం తొ పాటు ఇవ్వాలి. ట్రాక్టర్ తొ దుక్కులు చేయటానికి గంటకు రూ.800, పురుగు మందులు పిచికారీ చేయుటకు 500 లీ. డ్రమ్ముకు రూ.350, కొమ్మలు కత్తిరింపు, ఎరువులు, కోతకూలీలు తడిసి మోపెడవుతున్నాయి. సరాసరి ఎకరా మామిడి పంట సాగుకు రూ. 45,000 అవుతున్నది. ఇప్పుడు శరాఘాతంలా మచ్చ తెగులు రైతును నట్టేట ముంచుతున్నాయి. పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిన్న మచ్చ ఉన్నా తీసి పడేస్తున్నారు.
గతంలో తోతపురి రకం కోత సమయంలో పండు మాగిన కాయలు తక్కువ ధరకు కొని పల్ప్ ఆడించేవారు. ఇప్పుడు చిన్న మచ్చ ఉన్న, కాయలు గ్రేడింగ్ లో పారవేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ సంవత్సరం ఆర్డర్లు ఉన్నా, కొనటానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? మొత్తంగా మామిడి కొనుగోళ్ళ విషయంలో రైతుల గోడును కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందా? ధర పడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు నష్టపోకుండా కొనుగోళ్ళు చేయించింది.
కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలు కనిపించడ లేదు. మామిడి రైతులను ఆదుకునేందుకు వైయస్ఆర్సీపీ ముందుండి పోరాడుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా గిట్టుబాటు రేటుకు కొనుగోళ్ళు చేయించే వరకు పోరాడుతుంది` పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.