ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం
21 Jan, 2021 13:37 IST
విశాఖ: నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి కొందరి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారన్నారు. విశాఖలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ స్వార్థ ప్రయోజనాలతో వెళ్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి తన పదవి ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమని తెలిసినా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలిచే స్థితి టీడీపీకి ఉందా..? అని ప్రశ్నించారు. న్యాయస్థానం తీర్పుపై తమకు గౌరవం ఉందన్నారు.