రాష్ట్రంలో భారీ మ‌ద్యం కుంభ‌కోణం 

17 Oct, 2025 15:14 IST

తాడేప‌ల్లి: ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తోనే రాష్ట్రంలో న‌కిలీ, అక్ర‌మ మ‌ద్యం వ్యాపారం సాఫీగా సాగుతోంద‌ని, బెల్ట్ షాపులు, ప‌ర్మిట్ రూమ్‌లు, బార్ల ముసుగులో మ‌ద్య‌పాన ప్రియుల క‌డుపుకొట్టి టీడీపీ నాయ‌కులు క‌ళ్లు చెదిరే స్థాయిలో భారీగా దోచుకుంటున్నార‌ని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పేర్ని వెంక‌ట్రామయ్య (నాని) మండిపడ్డారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ముల‌క‌ల‌చెరువు, ఇబ్ర‌హీంప‌ట్నంలో త‌యారు చేసే న‌కిలీ మ‌ద్యం అమ్ముకునేందుకు వీలుగానే అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల‌కే రూ.99 ల లిక్క‌ర్ సేల్స్ ఆపేశార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు న‌డుస్తున్నాయ‌ని క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబే అంగీక‌రించార‌ని, లిక్క‌ర్ షాపుల్లో 25 శాతం డిజిట‌ల్ పేమెంట్స్ జ‌రుగుతున్నాయ‌నే దానికి ఆధారాల‌తో నిరూపింగలరా అ‌ని స‌వాల్ చేశారు. దీంతోపాటు రూ.99ల లిక్క‌ర్ సేల్స్ వివ‌రాలు కూడా వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక తీసుకొచ్చిన బార్ పాల‌సీ వెనుక భారీ స్కామ్ దాగి ఉంద‌ని, బార్ల య‌జ‌మానులు ప్ర‌భుత్వం నుంచి కాకుండా ముల‌క‌ల‌చెరువులో త‌యారు చేసిన న‌కిలీ మ‌ద్యం, ప‌క్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అక్ర‌మ మ‌ద్యం విక్ర‌యిస్తున్నార‌ని ఆరోపించారు. నా మాట‌లు నిరూపించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌న్న మాజీ మంత్రి పేర్ని, ద‌మ్ముంటే బార్‌లు త‌నిఖీ చేయ‌డానికి అన్ని పార్టీల నాయ‌కుల‌తో నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

క్యూఆర్ కోడ్ పెడుతున్నామ‌ని చంద్ర‌బాబు  ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాలా?  

క్యూఆర్ కోడ్ అనే స‌రికొత్త విధానాన్ని తొలిసారిగా ఏపీలోనే ప్ర‌వేశ‌పెట్టార‌ని, అది కూడా కూట‌మి ప్ర‌భుత్వంలోనే జ‌రిగింద‌ని, ఈ క్యూఆర్ కోడ్ ద్వారానే లిక్క‌ర్ అమ్మ‌కాలు సాగుతాయ‌ని, ఇదొక వినూత్న ఆలోచ‌న అన్న‌ట్టు తెలుగుదేశం బ్యాచ్ ప్ర‌చారం చేసుకుంటోంది. దాన్ని ఎక్సైజ్ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, క‌మిష‌న‌ర్ ముఖేష్ కుమార్ మీనా క‌లిసి రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు ఇదేదో గొప్ప ఘ‌న‌త‌గా చెప్పుకుంటున్నారు. ముఖ్య‌మంత్రికి రాష్ట్రంలో ఇంకేం స‌మ‌స్య‌లే కాన‌రాన‌ట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామ‌ని ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌క‌టించాడు. క్యూఆర్ కోడ్ గురించి ముఖ్య‌మంత్రే ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడేస్తుంటే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఏం చేస్తున్న‌ట్టు? ఇదేదో చారిత్ర‌క విజ‌యంగా కొల్లు ర‌వీంద్ర విలేక‌రుల‌ను వెంట‌బెట్టుకుని మ‌ద్యం షాపుల‌కెళ్లి సీసాల మీద ఉన్న క్యూఆర్ కోడ్ సెల్‌పోన్‌తో స్కాన్ చేస్తున్నాడు. 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే మ‌ద్యం బాటిళ్ల‌పై క్యూఆర్ కోడ్ 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో డిస్టిల‌రీల నుంచి త‌యార‌య్యే ప్ర‌తి బాటిల్ కూడా క్యూఆర్ కోడ్‌తోనే బ‌య‌ట‌కొచ్చేది. ఆ క్కూఆర్ కోడ్ ద్వారా మ‌ద్యం ఏ డిస్టిల‌రీ ఎప్పుడు త‌యారు చేసిందనే వివ‌రాలు వ‌చ్చేవి. వాటిని ప్ర‌భుత్వం ద్వారా న‌డప‌బ‌డే మ‌ద్యం దుకాణాల‌కు పంపేవారు. గ‌డిచిన ఐదేళ్లుగా జ‌రిగిన విధానాన్ని కొత్తగా తీసుకొచ్చిన‌ట్టు ప్ర‌చారం చేసుకోవ‌డం సిగ్గుచేటు. వైయ‌స్ జ‌గ‌న్ హయాంలో ఐదేళ్ల‌పాటు లిక్క‌ర్ బాటిల్స్ పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక తీసేశారు. 16 నెల‌ల తర్వాత కొత్త‌గా తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా న‌కిలీ మ‌ద్యం దందాలు వెలుగుచూడ‌టంతోపాటు న‌కిలీ లిక్క‌ర్ త‌యారీ యూనిట్‌ల తీగ‌లాగితే టీడీపీ డొంక క‌దిలింది. ఇలాంటి ప‌రిస్ధితులు వ‌చ్చినప్పుడు ఏ ప్ర‌భుత్వాధినేత అయినా మ‌ద్యం షాపుల్లో తనిఖీలు నిర్వ‌హించాల‌ని ఆదేశాలిస్తాడు. కానీ చంద్ర‌బాబు ఆదేశించాలేదు. నిందితులంతా టీడీపీ నాయ‌కులు కాబ‌ట్టి వారిని కాపాడేందుకు క్యూఆర్ కోడ్ పేరుతో కొత్త డ్రామాకు తెర‌దీశారు. ముల‌క‌ల‌చెరువు, ఇబ్రహీంప‌ట్నంలో త‌యారు చేసిన న‌కిలీ లిక్క‌ర్ ని లిక్క‌ర్ షాపుల‌కు అనుబంధంగా ఏర్పాటు చేసిన ప‌ర్మిట్ రూమ్‌లు, గ్రామాల్లో విచ్చ‌ల‌విడిగా వెల‌సిన‌ బెల్ట్ షాపుల ద్వారా విచ్చ‌ల‌విడిగా తాగిస్తున్నారు. ఇలా న‌కిలీ లిక్క‌ర్ దందా య‌థేచ్చ‌గా సాగించాల‌నే కుట్ర ప‌న్ని అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ విధానం తీసేశారు. అందుకు అనుగుణంగా ప్ర‌భుత్వ ఆధీనంలో నడిచే మ‌ద్యం దుకాణాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టేశారు. న‌కిలీ లిక్క‌ర్ దందాల గుట్టుబ‌య‌ట ప‌డ‌టంతో గ‌తిలేని ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌ను మాయ‌చేయ‌డానికి క్యూఆర్ కోడ్ డ్రామా ఆడుతున్నారు. రాష్ట్రంలో 3736 మ‌ద్యం దుకాణాలుంటే అన్నింటికీ ప‌ర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే అనుమ‌తించింది. వీటికితోడు రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ల‌క్ష‌ల బెల్ట్ షాపులు కొన‌సాగుతున్నాయి. ఈ ప‌ర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ ఎవ‌రు స్కాన్ చేస్తున్నారు? ఇక్క‌డ విక్ర‌యిస్తున్న లూజ్ లిక్క‌ర్ న‌కిలీదా ఒరిజిన‌ల్‌దా అనేది తేల్చేది ఎవ‌రు? 

జ‌య‌చంద్రా రెడ్డికి రెడ్ కార్న‌ర్ నోటీసులు ఇవ్వలేదే? 

రాష్ట్రంలో బెల్ట్ షాపులున్నాయ‌ని సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే క‌లెక్ట‌ర్ స‌మావేశంలోనే ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ముఖేశ్ కుమార్ మీనాతో మాట్లాడుతూ అంగీక‌రించారు. ఇది అన్ని ఎల్లో మీడియా చానెళ్ల‌లో లైవ్ లో ప్ర‌సారం జ‌రిగింది. ఈ బెల్ట్ షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేది ఎవ‌రు? ముల‌క‌ల‌చెరువులో న‌కిలీ లిక్క‌ర్ రాకెట్ బ‌య‌ట‌ప‌డితే దాన్ని న‌డిపేది తంబ‌ళ్ల‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జి జ‌య‌చంద్రారెడ్డి అని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌ప‌డినా ఆంధ్రజ్యోతిలో మాత్రం ఆ జ‌యచంద్రారెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అనుచ‌రుడ‌ని రాశారు. వైయ‌స్ఆర్‌సీపీ కోవ‌ర్టు అని టీడీపీ ప్ర‌చారం చేసింది. దానిమీద వ‌రుస పెట్టి డిబేట్ లు పెట్టారు. జ‌య‌చంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఊరుకున్నారే కానీ ఇంత‌వ‌ర‌కు అరెస్ట్ మాత్రం చేయ‌లేదు. మూడు రోజుల వ‌రకు ఏమీ మాట్లాడ‌ని ఈనాడు మెల్లిగా రంగంలోకి దిగి జ‌య‌చంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జ‌నార్ద‌న్‌రావు లు మీదుగా తీసుకొచ్చి మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు జోగి ర‌మేశ్ మీద‌కు మ‌ళ్లించారు. న‌కిలీ లిక్క‌ర్ కంపు టీడీపీకి అంటుకోవ‌డంతో ఎలా క‌వ‌ర్ చేయాలో అర్థంకాక ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి తంటాలు ప‌డుతున్నాయి. వేల కోట్లు విలువైన‌ న‌కిలీ లిక్క‌ర్ దందాలో అడ్డంగా దొరికినా జ‌య‌చంద్రారెడ్డి, క‌ట్టా సురేంద్ర నాయుడు, జ‌నార్ద‌న్‌రావులుకు ఇప్ప‌టివ‌ర‌కు రెడ్ కార్న‌ర్ నోటీసులు ఇవ్వలేదు. కానీ వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌కు సైతం సోష‌ల్ మీడియా కేసుల్లోనే రెడ్ కార్న‌ర్ నోటీసులిచ్చి వేధిస్తున్నారు. పైగా న‌కిలీ లిక్క‌ర్ కేసులో నిందితుడు జ‌నార్ద‌న్‌రావును పెళ్లికొచ్చిన గెస్టును తీసుకెళ్లిన‌ట్టు తీసుకెళ్లారు. ప్ర‌భుత్వానికి నిజంగా నిజాయితీ ఉంటే ఇవ‌న్నీ చేస్తారా?  ఎలాంటి భ‌యం లేకుండా నిందితులు ఇలా స్వేచ్ఛ‌గా ఎలా తిరుగుతారు?  జ‌నార్ద‌న్‌రావు ఆఫ్రికాలో ఉన్న‌ప్పుడు టీడీపీ నాయ‌కుల‌కు సంబంధం లేద‌ని వీడియో రిలీజ్ చేయించారు. విజ‌య‌వాడ‌కు పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల ప్ర‌మేయం ఉన్న‌ట్టు చెప్పించారు. చంద్ర‌బాబు నుంచి అక్షింత‌లు ప‌డ‌టంతో మ‌ళ్లీ జోగి ర‌మేశ్‌ని ఇరికించారు. జ‌నం న‌వ్వుతార‌న్న ఇంగిత జ్ఞానం లేకుండా పోలీసుల‌ను అడ్డం పెట్టి ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పిస్తున్నారు. 

ద‌మ్ముంటే డిజిట‌ల్ పేమెంట్స్ వివ‌రాలు ఇవ్వాలి

నాణ్య‌మైన మ‌ద్యం రూ.99ల‌కే ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌ప్పుడు ఆర్భాటంగా ప్ర‌చారం చేసి గెలిచాక రెండు నెల‌ల‌కే ఎందుకు ఆపేశారు?  న‌కిలీ లిక్క‌ర్ అమ్ముకోవ‌డానికి ఇబ్బంది అవుతుంద‌ని భావించారు కాబ‌ట్టే దాన్ని ఆపేశారు. చంద్ర‌బాబు, ఎక్సైజ్ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ముఖేష్ కుమార్ మీనాల‌కు ద‌మ్ముంటే రూ.99ల‌కు అమ్మిన లిక్క‌ర్ సేల్స్ వివ‌రాల‌ను బ‌య‌ట‌పెట్టాలి. 25 శాతం డిజిట‌ల్ పేమెంట్స్ జ‌రిగినట్టు చెప్ప‌డం కూడా ప‌చ్చి అబ‌ద్దం. నా అంచ‌నా ప్ర‌కారం 10 శాతం డిజిట‌ల్ పేమెంట్స్ కూడా జ‌రిగి ఉండ‌వు. నాడు మా ప్రభుత్వ హ‌యాంలో క్యాష్ పేమెంట్స్ జ‌రిగాయ‌ని గుండెలు బాదుకున్నారు. ద‌మ్ముంటే ఇప్పుడు ఏ షాపులో ఎంత డిజిట‌ల్ పేమెంట్స్ జ‌రిగాయో వివ‌రాలివ్వాలి. 25 శాతం పేమెంట్స్ జ‌రుగుతున్నాయ‌నేది నిజం అనుకుంటే మిగ‌తా 75 శాతం డబ్బులు ఏమైపోతున్న‌ట్టు? చంద్ర‌బాబు క‌ర‌క‌ట్ట బంగ్లాకు పోతున్నాయా? జ‌నార్ద‌న్ ఫ్యాక్టరీలో త‌యార‌య్యే మ‌ద్యం న‌కిలీదే కానీ, ప్ర‌మాద‌కరం కాద‌ని ఎక్సైజ్ అధికారులు ధృవీకిరంచిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజ‌మైతే ఇంత‌క‌న్నా దారుణం ఇంకోటి ఉండ‌దు. అంటే రాబోయే రోజుల్లో ముల‌క‌ల‌చెరువు, అన‌కాప‌ల్లి, ఏలూరు, బాప‌ట్ల‌, నెల్లూరులో బ‌య‌ట‌ప‌డ్డ న‌కిలీ మ‌ద్యానికి కూడా ఆమోద ముద్ర వేయ‌ర‌ని గ్యారెంటీ ఏముంది?  అంటే, జ‌య‌చంద్రారెడ్డి మీద టీడీపీ స‌స్పెన్ష‌న్ ఎత్తేస్తారు. జ‌నార్ద‌న్‌ రావును జైలు నుంచి బ‌య‌ట‌కు తీసుకొస్తారని స్ప‌ష్టంగా తెలిసిపోతుంది. 

న‌కిలీ, అక్ర‌మ మ‌ద్యంతోనే బార్లు న‌డుస్తున్నాయి

మోస‌పు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు అన్ని వ‌ర్గాల ప్ర‌జల‌ను దారుణంగా వంచించాడు. తాజాగా చంద్ర‌బాబు పొడిచిన వెన్నుపోటుకి లిక్క‌ర్ షాపులు టెండ‌ర్లు ద‌క్కించుకున్న వ్యాపారులు సైతం ల‌బోదిబోమంటున్నారు. బార్ల య‌జ‌మానులు ప్ర‌భుత్వం నిర్దేశించిన ఫీజులు చెల్లించాలంటే విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌ర్నూలు, తిరుప‌తి వంటి పెద్ద సిటీల్లో  రోజుకు రూ. 3ల‌క్ష‌లు అమ్మాలి. వీరు నెల‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర రూ. 80 ల‌క్ష‌ల స‌రుకు కొనాల్సి ఉంటుంది. బంద‌రు, గుడివాడ‌, అన‌కాప‌ల్లి, ప్రొద్దుటూరు, నంద్యాల‌ వంటి చోట్ల రోజుకు రూ.2.5 ల‌క్ష‌లు అమ్మితే త‌ప్ప బ్రేక్ ఈవెన్ రాదు. ఈ బార్ల‌న్నీ నెల‌కు ఎంత స‌రుకు కొంటున్నారో వివ‌రాలు బ‌య‌ట‌పెట్టే దమ్ము ప్ర‌భుత్వానికి ఉందా?  ఈ లెక్క‌లు చూపించ‌గ‌ల‌రా?  వారంతా కొన‌కుండానే బార్లు ఎలా నడుస్తున్నాయంటే.. మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ స‌రుకుతో న‌డిపిస్తున్నారు. ప్ర‌భుత్వం నుంచి కొన్న స‌రుకు కాకుండా జ‌య‌చంద్రారెడ్డి, జ‌నార్ద‌న్‌రావులు త‌యారు చేసిన న‌కిలీ మ‌ద్యం లేదా పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన అక్ర‌మ మ‌ద్యం తాగించ‌డం వ‌ల్లే బార్లు నడుస్తున్నాయి. ఇవ‌న్నీ నిజం కాదని నిరూపించ‌గ‌ల‌రా?  చంద్ర‌బాబుకి ఛాలెంజ్ విసురుతున్నా ద‌మ్ముంటే అన్ని పార్టీల నాయ‌కులు, జ‌ర్న‌లిస్టుల‌తో నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వేసి బార్ల వ‌ద్ద‌కు పంపించ‌గ‌ల‌రా?  బార్ల ద‌గ్గ‌ర ఉన్న స‌ర‌కంతా ప్ర‌భుత్వం వ‌ద్ద కొన్న‌ది కాదు. వారు అమ్మిన‌దాంట్లో ప‌ది శాతం కూడా ప్ర‌భుత్వం వ‌ద్ద కొన్న‌ది కాదు. రాష్ట్రంలోని 500ల‌కు పైగా బార్ల నుంచి నెల‌నెలా రూ.5 కోట్లు అడ్వాన్సుగా వ‌సూలు చేస్తున్నారు. ఇది న‌కిలీ మ‌ద్యం క‌న్నా భారీ కుంభ‌కోణం. ఈ డబ్బంతా ఎక్క‌డికి పోతున్న‌ట్టు?  త‌నిఖీలు చేయ‌కుండా ముందుగానే లంచాలిస్తున్నారు. దొంగ స‌రుకు బార్లలో విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి, క‌మిష‌న‌ర్ ఏం చేస్తున్న‌ట్టు?  వారి అండ‌దండ‌లు లేకుండా దొంగ స‌రుకు అమ్మ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  బార్‌ల‌లోకి వెళ్లి స్టాక్ వెరిఫై చేసే ద‌మ్ము ప్ర‌భుత్వానికి ఉందా? కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బార్ పాల‌సీయే పెద్ద స్కామ్. ఇక్క‌డ అమ్మే ప్ర‌తి బాటిల్ ఎమ్మార్పీ మీద ఏఆర్టీ వేసి బార్ల‌కు ఇస్తుంటే ఎలా త‌క్కువ‌కు అమ్ముతున్నారు?  

న‌కిలీ లిక్క‌ర్ పై ప‌వ‌న్ కళ్యాణ్ ప్ర‌శ్నించ‌రా? 

రాష్ట్రంలో బెల్ట్ షాపులు మూసేసే దమ్ముందా ప్ర‌భుత్వానికి? అధికారంలోకి వ‌చ్చిన క్ష‌ణం నుంచి మ‌ద్యం పేరుతో పాపాలు, ఘోరాలు చంద్ర‌బాబు చేస్తూ ఆ కంపుని వైయ‌స్ఆర్‌సీపీకి అంటించే కుట్ర చేస్తున్నారు. ఆధారాల‌తో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నాయ‌కుల‌ను స్వేచ్ఛ‌గా వ‌దిలేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు జోగి ర‌మేశ్ ఫోన్ మాత్రం పోలీసులు తీసుకెళ్లారు. ఇంత‌క‌న్నా దారుణం ఇంకోటి ఉంటుందా?   ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నార‌న్న ఆలోచ‌న కూడా చేయ‌డం లేదు. పాఠ‌కులు తిట్టుకుంటున్నార‌న్న సోయ లేకుండా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ఇత‌ర ఎల్లో మీడియా ఛానెళ్లు దిగ‌జారి వార్తలు రాస్తున్నాయి. న‌కిలీ, అక్ర‌మ మ‌ద్యం పేరుతో జ‌రుగుతున్న కుంభ‌కోణం వెనుక ఎవ‌రున్నారు?  నిందితులు ఎవ‌రు అనేది ప్ర‌జ‌ల‌కు తెలియాలి. ప్ర‌భుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతుంటే ప్ర‌భుత్వం నిద్ర‌పోతుందా? ఆనాడు వైయ‌స్ జ‌గ‌న్ మ‌ద్య‌పాన ప్రియుల క‌డుపుకొట్టాడ‌ని ఊగిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఇన్ని దారుణాలు జ‌రుగుతుంటే నోరెత్తే ధైర్యం చేయ‌డం లేదు. అబ‌ద్ధాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ కి అంటించ‌డానికి మాత్రం ఊపుకుంటూ వస్తాడు. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టైనా ఈ 16 నెల‌ల్లో అమ‌లు చేశారా అని ఆలోచించుకోవాలి. అధికారంలోకి వ‌స్తే భారీగా కంపెనీలు ఏర్పాటు చేసి యువ‌త‌కు ఉద్యోగాలిప్పిస్తాన‌ని చెప్పి జ‌యచంద్రారెడ్డి, జ‌నార్ద‌న్‌రావు వంటి వారితో న‌కిలీ లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీలు పెట్టించానని చెప్పుకుంటాడా?