నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.సీఎం వైయస్ జగన్‌ను కలిసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొత్తగా చెప్పాల్సినఅవసరం లేదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలు, ఆయన తీరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖాళీని భర్తీ చేసేందుకు నియోజకవర్గ సమన్వయకర్తను నియమించామన్నారు.
సంతోషంగా ఉంది: ఆదాల ప్రభాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ రోజు నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించడం సంతోషంగా ఉంది. అన్ని విధాల కష్టపడి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ గెలుపునకు శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. వైయస్ జగన్‌కు ఆదాల ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారు: బాలినేని
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబును కలిసి మాట్లాడిన తరువాత ఫోన్ ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బాలినేనిశ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా శ్రీధర్‌రెడ్డి ఆలోచనలు, భావాలు అన్నీ కూడా చూడటం జరిగింది. ఆయన చంద్రబాబుతో చర్చించి నెల్లూరు రూరల్ టికెట్టుతో టీడీపీ తరఫున పోటీ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దాన్ని తప్పించుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ అని శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. మూడు రోజుల క్రితమే అది ఫోన్‌ట్యాపింగ్ కాదు..రికార్డింగ్ అని నేను సవాలు చేశాను. దానిపై శ్రీధర్‌రెడ్డి ముందుకు రాలేదు. శ్రీధర్‌రెడ్డి వ్యవహార శైలిపై సీఎం వైయస్ జగన్ చర్యలు తీసుకున్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా సీఎం వైయస్ జగన్ నియమించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ గెలుపు నల్లేరుపై నడికే. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ద్వారానే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పార్టీ మారే సమయంలో వైయస్ఆర్సీపీపై నెపం మోపుతున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.