విజయవాడ: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అవినీతికి హద్దు లేకుండా పోతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారన్నారు. విజయవాడ 26వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని ఇంటింటికీ తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అమరావతి పేరు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి మోసం చేసిన టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు గుడివాడ నరేంద్ర రాఘవ, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.