Printed on 20-06-2018 12:51:45 PM

సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్న కోడెల
  • స్పీకర్‌స్థాయిని మర్చి టీడీఎల్పీ సమావేశానికి హాజరు
  •  వ్యవస్థను కించపరిచేలా కోడెల తీరు: ఎమ్మెల్యే రోజా
  • గతంలోనూ కోడెలది ఇదే తంతు, అయినా మారని వైనం

హైదరాబాద్‌: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాను ఆడిందే ఆట... పాడిందే పాట అన్న తీరుగా తయారైంది కోడెల వైఖరి. స్పీకర్‌ హోదాను బాధ్యతగా నిర్వర్తించాల్సిన కోడెల తెలుగుదేశం పార్టీ పక్షపాతినని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అమరావతిలో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక పార్టీ సమావేశానికి స్పీకర్‌ హాజరుకావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీఎల్పీ సమావేశానికి స్పీకర్‌ కోడెల పాల్గొనడం దారుణమని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. స్పీకర్‌ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. 

గతంలో ఏ స్పీకర్‌ చేయని విధంగా కోడెల వ్యవహరిస్తున్నారు.తన హోదాకు తగని  సమావేశాలకు హాజరుకావడం, సొంత పార్టీకి ఒత్తాసు పలకడం, నేతలకు కొమ్ముకాయడం ఈయనకు కొత్తేమీ కాదు. మూడేళ్ల కాలంలో ఎన్నో వివాదస్పద వ్యాఖ్యలు, చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కి, అధికార పార్టీకి కొమ్ముకాయడం, మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు సందర్భంగా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం. అదే విధంగా ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టానని బాహాటంగా చెప్పుకోవడం, గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కుటుంబాన్ని శాసనసభకు ఆహ్వానించడం.. ఇలా ఒక్కటేమిటీ చాలా ఘనకార్యాలు చేశారు. 

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన...
గతంలో ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తాను ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లు ఖర్చు పెట్టానని ఒప్పుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తాను రూ. 11.5కోట్లు ఖర్చు చేశానని స్వయంగా స్పీకర్‌ వెల్లడించారు. ఎన్నికల కమిుషన్‌ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే అభ్యర్థి రూ. 28 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. ఆ నిబంధనలు తుంగలో తొక్కారు. స్పీకర్‌ కోడెల వ్యాఖ్యలపై.. ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు...
విశాఖపట్నంలో మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సును పురస్కరించుకొని మహిళలను కించపరిచే విధంగా స్పీకర్‌ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వాహనం కొని షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు.. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారు. అంటూ వారిని అవమానపరిచే విధంగా మాట్లాడి రచ్చకెక్కారు.

సీఎం సైగతో సభ వాయిదా..
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సభ్యులు గొంతెత్తి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంటే వారి గొంతునొక్కే ప్రయత్నం. ప్రజా సమస్యలను సభ దృష్టికి రానివ్వకుండా ప్రతిపక్షం మైక్‌ కట్‌ చేస్తూ అధికార నేతలతో ప్రతిపక్ష సభ్యులను తింటించడం స్పీకర్‌ గత సమావేశాల్లో చేశారు. ముఖ్యమంత్రి సభను వాయిదా వేయమని సైగ చేయగానే వాయిదా వేసి వెళ్లిపోవడం.. టీడీపీ నేతలకు సభలో గంటల కొద్ది మైక్‌ ఇవ్వడం కోడెలకే చెల్లింది. అదే విధంగా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గి టీడీపీ కండువా కప్పుకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం ఫిర్యాదులు చేసినా పట్టించుకోని దుస్థితి నెలకొంది. ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉన్నా.. ఆ ఫిరాయింపు దారులపై చర్యలు తీసుకోకుండా వాటిని మరింతగా ప్రోత్సహించే విధంగా మౌనం వహించారు.